Leading News Portal in Telugu

Iran: శాటిలైట్ ‘సొరయా’ని ప్రయోగించిన ఇరాన్.. వెస్ట్రన్ దేశాల్లో ఆందోళన..


Iran: శాటిలైట్ ‘సొరయా’ని ప్రయోగించిన ఇరాన్.. వెస్ట్రన్ దేశాల్లో ఆందోళన..

Iran: మొన్నటి వరకు ఉత్తర కొరియా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలకు సవాల్ విసురుతూ.. శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపగా, తాజాగా ఇరాన్ తన శాటిలైట్ ‘సొరయా’ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) ఆంక్షలను ధిక్కరించి ప్రయోగాన్ని చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సోరయా శాటిలైట్‌ని భూ ఉపరితలం నుండి 750 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.


ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైళ్లను మెరుగుపరుస్తుందనే వెస్ట్రన్ దేశాల భయాల నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగింది. మూడు దశల రాకెట్‌తో ఈ సోరయా శాటిలైట్‌ని ఉంచినట్లు ఇరాన్ అధికారిక IRNA వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఇది ఏ తరహా శాటిలైట్ అనే వివరాలను వెల్లడించలేదు. ఈ ప్రయోగం ఇరాన్ పౌర అంతరిక్ష కార్యక్రమంతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అంతరిక్ష కార్యక్రమంలో భాగమని నివేదిక తెలిపింది.

ఇరాన్ యూఎన్ భద్రత మండలి తీర్మానాన్ని ధిక్కరిస్తోందని అమెరికా గతంలో పేర్కొంది. అణ్వాయుధాలను రవాణా చేయగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించవద్దని ఆంక్షలు విధించింది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలకు అవసరమైన నాణ్యమైన యురేరియం ఉందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ హెచ్చరించారు.

మరోవైపు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ పాత్ర ఉందని, ఎర్ర సముద్రంలో వెస్ట్రన్ దేశాలతో పాటు ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న నౌకలపై యెమెన్ హౌతీలు దాడులు చేస్తున్నారు. దీని వెనక కూడా ఇరాన్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇటీవల ఇరాన్, పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్‌పై దాడులు నిర్వహించింది.