Leading News Portal in Telugu

China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి..


China: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి..

China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. మంటలు చెలరేగిన భవనంలో ఇంటర్నెట్ కేఫ్‌లు, పలు శిక్షణ సంస్థలు ఉన్నట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి 5 రోజులు ముందు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు.


ఈ దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి, ప్రజలు ప్రాణాలు రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైనా భవనాల్లో భద్రతా ప్రమాణాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సర్వ సాధారణంగా జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్ నగరంలో ఒక కార్యాలయ భవనంలో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి 26 మంది మరణించారు. దీనికి ముందు బీజింగ్ లోని ఒక ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరగడంతో 26 మంది మరణించారు.