Leading News Portal in Telugu

Israel Hamas War: ఒక వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు.. మరోవైపు గాజాలో 15 మంది హతం..


Israel Hamas War: ఒక వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు.. మరోవైపు గాజాలో 15 మంది హతం..

శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది. హమాస్ కమాండర్లు ఇక్కడి సొరంగాల్లో దాక్కున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ భయపడుతోంది. దీంతో ఆ సొరంగాల్లోకి నీటిని పోసి వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.


ఇక, ఉత్తర గాజాలోని పాఠశాలలో దాక్కున్న 15 మంది హమాస్ ఉగ్రవాదులను మంగళవారం నాడు హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా.. 313 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, తాజా మరణాలతో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 26 వేల 900కి చేరుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు.

అలాగే, గాజా నగరంలోని షాతీ శరణార్థి శిబిరం శివార్లలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక సైన్యం దాడులు చేశాయి. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నాటికి గాజాలో 2.3 మిలియన్ల జనాభా ఉండగా అందులో ప్రస్తుతం 85 శాతం మంది నిరాశ్రయులయ్యారు. మిగతా వారు ఇతర ప్రాంతాలకు వలస పోయారు. జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఆకలితో చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి అధికారులు వెల్లడించారు.