
India-Maldives: మాల్దీవులు, ఇండియా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ప్రో చైనా వైఖరని కనబరుస్తున్నాడు. నిజానికి ఎన్నికైనా ఏ అధ్యక్షుడైనా మొదటగా భారతదేశంలో పర్యటిస్తారు. అయితే, ముయిజ్జూ మాత్రం చైనా పర్యటనకు వెళ్లాడు. భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ సందర్శించడంతో ఒక్కసారిగా అక్కడి మంత్రులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. ముగ్గురు మంత్రులను ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేసినప్పటికీ.. భారత్ ప్రజలు ‘‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’’ అంటూ ఆ దేశాన్ని బహిష్కరించారు. గతంలో మాల్దీవులను సందర్శించే టూరిస్టుల్లో మొదటిస్థానంలో ఉండే భారత్, ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. దీంతో మాల్దీవులు పీకల్లోతు కష్టాల్లో ఉంది.
ఇదిలా ఉంటే మాల్దీవ్స్‌కి ఇండియా మరో షాక్ ఇచ్చింది. గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మాల్దీవులకు 22 శాతం సాయాన్ని తగ్గించాలని భారత్ ప్రతిపాదించింది. మాల్దీవుల అభివృద్ధికి రూ.600 కోట్లను మాత్రమే కేటాయించారు. 2023-24లో మాల్దీవులకు సహాయంగా రూ.770.90 కోట్లు అందించారు. వాస్తవానికి, 2023 బడ్జెట్‌లో మాల్దీవుల కోసం ప్రభుత్వం మొదట రూ.400 కోట్లు కేటాయించింది. తర్వాత దానిని రూ.770.90 కోట్లకు సవరించింది. భారత్ ఆ దేశానికి రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌళిక సదుపాయాల వంటి రంగాల్లో సాయం చేస్తోంది.
ఒక్క మాల్దీవులకు కాదు, భారత్ విదేశాలకు అందిస్తున్న సాయాన్ని ఈ సారి తగ్గించింది. భారతదేశం 2024-25 కోసం విదేశీ దేశాలకు సహాయంగా రూ. 4883.56 కోట్లు కేటాయించింది, ఇది 2023-24లో బడ్జెట్ చేసిన 5426.78 కోట్ల నుండి తగ్గింది. భూటాన్, నేపాల్ దేశాలకు గ్రాంట్లను పెంచింది. భూటాన్‌కు అభివృద్ధి సహాయం కోసం రూ.2068.56 కోట్లు కేటాయించగా, నేపాల్‌కు రూ.700 కోట్లు కేటాయించారు. కేటాయింపులు తగ్గించబడిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. మరోవైపు శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, మారిషస్, సీషెల్స్‌లకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.