
British MP: అయోధ్య రామ మందిరంపై బీబీసీ పక్షపాత కవరేజ్‌పై బ్రిటిష్ ఎంపీ బాబా బ్లాక్‌మన్ ధ్వజమెత్తాడు. జనవరి 22న జరిగిన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు సంబంధించి బీబీసీ తీరు సరిగా లేదని అన్నారు. బీబీసీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో దానికి తగిన రికార్డుల్ని అందించాలని అన్నారు. యూకే పార్లమెంట్‌లో మాట్లాడిన బాబ్ బ్యాక్‌మన్.. 2000 ఏళ్లకు పైగా దేవాలయం ఉన్న విషయాన్ని మరిచిపోయి, మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అంటూ అయోధ్య రామ మందిరం గురించి బీబీసీ నివేదించిందని అన్నారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది, ఇది రాముడి జన్మస్థలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చాలా సంతోషం వ్యక్తం చేశారని బ్లాక్‌మన్ అన్నారు. అయితే, బీబీసీ కవరేజీలో ఇది మసీదు ధ్వంసం చేసిన ప్రదేశం అని చెప్పడం చాలా విచారకరం అన్నారు. 2000 ఏళ్లకు ముందు ఇక్కడ దేవాలయం ఉన్న విషయాన్ని బీబీసీ మరిచిపోయిందని, పట్టణానికి సమీపంలో 5 ఏకరాల స్థలాన్ని మసీదుకు కేటాయించారని ఆయన అన్నారు. బీబీసీ నిష్పాక్షికత, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో సరైన సమాచారాన్ని అందించాలని, దీని వైఫల్యంపై ప్రభుత్వం చర్చకు సమయం ఇవ్వాలని ఇతర పార్లమెంట్ సభ్యులను ఆయన కోరారు.