Leading News Portal in Telugu

Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉరిశిక్ష తప్పదా.? పాక్ ఆర్మీ చట్టాలు ఏం చెబుతున్నాయి.?


Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉరిశిక్ష తప్పదా.? పాక్ ఆర్మీ చట్టాలు ఏం చెబుతున్నాయి.?

Imran Khan: పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భయపెడుతున్నారు.


ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌పై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యంత తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిలో నేరం రుజువైతే ఉరిశిక్ష తప్పదు. పాకిస్తాన్ మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ మరణశిక్ష తప్పాదా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ గత చరిత్ర చూసినా కూడా.. ఇదే స్పష్టమవుతోంది. తమకు ఎదురుతిరిగిన ఏ నేతనైనా పాక్ ఆర్మీ క్షమించలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో పాక్ ప్రధానిగా ఉన్న జుల్ఫీకర్ అలీ భుట్టోను అక్కడి సైన్యం ఉరితీసింది. హుస్సేన్ షాషీద్ సుహ్రవర్దీ మిలిటరీ రూలర్ అయూబ్ ఖాన్‌కి ఎదురుతిరిగినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వంతు వచ్చింది.

మే 2023లో అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టైన తర్వాత అతని మద్దతుదారులు రావల్పిండిలోని పాక్ ఆర్మీ స్థావరాలు, ప్రధాన కార్యాలయాలపై దాడి చేశారు. ఇమ్రాన్ ఖాన్‌తో సహా 100 మంది నిందితులపై ఉగ్రవాద చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఇది పాక్ పై యుద్ధంగా పరిగణించబడుతోంది. పాక్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకుని, పాకిస్థాన్ సైన్యం లేదా భద్రతా బలగాలపై దాడి చేసే ఎవరైనా మరణశిక్ష విధించవచ్చు. మిలిటరీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే, ప్రస్తుతం మిలిటరీ కోర్టు తీర్పును ప్రకటించకుండా పాకిస్తాన్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 2023 మే 9 హింసలో ప్రధాన సూత్రధారిగా ఇమ్రాన్ ఖాన్ పరిగణించబడుతున్నాడు.