Leading News Portal in Telugu

Donald Trump: ట్రంప్‌కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..


Donald Trump: ట్రంప్‌కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..

Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్రంప్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత తీర్పు వచ్చింది.


అధ్యక్షుడిగా తన అధికారిక బాధ్యతలకు సంబంధించి కోర్టులు ప్రాసిక్యూట్ చేయలేవని ట్రంప్ చేసిన వాదనల్ని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తిరస్కరించింది. అతను అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అతని రక్షణ కల్పించిన ఏదైనా కార్యనిర్వాహక ఇమ్యూనిటీ పవర్ ఈ విచారణ నుంచి అతడిని రక్షించదని కోర్టు పేర్కొంది. యూఎస్ సుప్రీంకోర్టుకి అప్పీల్ కోసం వెళ్లడానికి ట్రంప్‌కి ఈ నెల 12 వరకు సమయం ఉంది.

మరోవైపు, ట్రంప్ లాయర్లు వాదిస్తూ.. మాజీ అధ్యక్షుడు చట్టపరమైన రక్షణలను పొందేందుకు అర్హులని, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చేత అభిశంసించబడి, సెనేట్ చేత పదవి నుండి తొలగించబడితే తప్ప అధికారిక చర్యల కోసం క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయబడడని వాదించారు. ఇప్పటికే ట్రంప్ నాలుగు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడనేది ఇందులో ఒకటి. అయితే, నాలుగు కేసుల్లో తాను నిర్దోషినని ట్రంప్ చెబుతున్నాడు, రాజకీయంగా తన ప్రచారాన్ని దెబ్బతీయడానికి ప్రేరేపించిన ప్రయత్నంగా ఆరోపించాడు.