
Chile Former President Sebastian Pinera Dead: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం లాస్ రియోస్ ప్రాంతంలోని లాగో రాంకో కమ్యూన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పినేరా మరణాన్ని ఆయన కార్యాలయం ధృవీకరించింది. నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్లో పినేరా ప్రయాణిస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పినేరా మృతిచెందగా.. మిగతా వారు గాయాలతో బయటపడ్డారు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. పినేరా మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెబాస్టియన్ పినేరా రెండు పర్యాయాలు చిలీ దేశాధ్యక్షుడిగా ఉన్నారు. మొదట 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2022 వరకు ఆయన పదవిలో ఉన్నారు. పినేరా పాలనలో చిలీలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి జరగగా.. నిరుద్యోగ శాతం తగ్గింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఆయన మంచి పాలన అందించారు. బిలియనీర్ అయిన పినేరా.. చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరిగా ఉన్నారు.