Leading News Portal in Telugu

India-Canada Row: “మా ఎన్నికల్లో జోక్యం”.. కెనడా ఆరోపణలపై భారత్ ఆగ్రహం..


India-Canada Row: “మా ఎన్నికల్లో జోక్యం”.. కెనడా ఆరోపణలపై భారత్ ఆగ్రహం..

India-Canada Row: ఇండియా-కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిపై భారత్ ఘాటుగానే స్పందిస్తూ.. ఉగ్రవాదులకు మీరు స్థావరం ఇస్తున్నారని, మీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఇదిలా ఉంటే, ఇటీవల మరోసారి కెనడా, భారత్‌పై అనవసర నిందలు వేసింది. మా అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని, కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం ఉందని ఆరోపించింది. భారత్‌ని తమ ఎన్నికల్లో జోక్యం చేసుకోగల ‘‘విదేశీ ముప్పు’’గా పేర్కొంది. ఇండియాతో పాటు చైనా, రష్యాలను కూడా ఇదే విధంగా నిందించింది.

ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎంఈఏ అధికా ప్రతినిధి రణధీప్ జైశ్వాల్ ఈ రోజు మాట్లాడుతూ.. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటుందనేది నిరాధారమైన ఆరోపణలని, వీటిని భారత్ తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి మా అంతర్గత విషయాల్లో కెనడా జోక్యం చేసుకుంటుందని, మేము ఈ సమస్య గురించి క్రమం తప్పకుండా వారి వద్ద లేవనెత్తుతున్నామని, మా ప్రధాన ఆందోళనల్ని పరిష్కరించడానికి కెనడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని జైశ్వాల్ అన్నారు.