
దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan Election) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరిగింది. ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ (Election Results) ప్రారంభించారు. నిన్నటి నుంచి లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ పార్టీ (Imran Khan) జోరు మీద ఉంది. నవాజ్ షరీఫ్ పార్టీ వెనుకంజలోకి వెళ్లింది. తొలుత షరీఫ్ పార్టీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. కానీ అంచనాలకు మించి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలోకి వచ్చి్ంది. ప్రస్తుతానికి 100 సీట్లకు పైగా లెక్కింపు జరగ్గా ఇమ్రాన్‌పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆయన మద్దతు దారులే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.
పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. కానీ 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా.. 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది.
పాకిస్థాన్ ప్రజలు పీటీఐ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారని.. భారీ మెజార్జీతో గెలవబోతున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని తెలిపారు. ఎన్నికల అధికారులు ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఫలితాల జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని పేర్కొంది.