Leading News Portal in Telugu

Israel–Hamas Conflict: దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 63 మంది మృతి


Israel–Hamas Conflict: దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 63 మంది మృతి

ఇద్దరు బందీలను కాపాడేందుకు దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. అయితే, అంతకుముందు, యుద్ధంలో తొలిసారిగా హమాస్‌ దగ్గర బందీలుగా ఉన్న వారిలో ఇద్దరిని ఇజ్రాయెల్‌ సైన్యం కాపాడింది. రఫా నగరంలో అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్‌లో వారిని రక్షించినట్లు ఇవాళ తెల్లవారు జామున ఐడీఎఫ్‌ వెల్లడించింది.


ఇక, రఫాలో ఐడీఎఫ్‌, ఐఎస్‌ఏ (షిన్‌బెట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ), పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఫెర్నాండో సిమోన్‌ మార్మన్‌, లూయీస్‌ హర్‌ ను హమాస్‌ చెర నుంచి ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది. వీరిని గతేడాది అక్టోబరు 7న హమాస్‌ ఉగ్రవాదులు నిర్‌ యిత్జక్‌ కిబుట్జ్‌ నుంచి కిడ్నాప్‌ చేశారని సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సైన్యం చెప్పుకొచ్చింది.

అయితే, గాజాలో దాడుల తరువాత సుమారు 1.4 మిలియన్ల మంది రఫాలో నివసిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న తమ ప్రాంతంలోని అమాయక ప్రజలను ఇజ్రాయెల్ చంపేస్తుందని హమాస్ ఆరోపించింది. పాలస్తీనియన్లను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇక, రాఫాకు ప్రజలు సురక్షితంగా చేరుకునేలా జాగ్రత్త తీసుకుంటానని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు హామీ ఇచ్చారు. గాజా ప్రజలు ఈజిప్టుకు వెళ్లే విషయంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. పాలస్తీనియన్లు తమ దేశంలోకి ప్రవేశించడం ఈజిప్టుకు ఇష్టం లేదు అని వెల్లడించింది.