Leading News Portal in Telugu

Burj Khalifa: ప్రధాని మోడీకి యూఏఈ సత్కారం.. బుర్జ్ ఖలీఫాపై వెలిగిపోయిన త్రివర్ణ పతాకం..


Burj Khalifa: ప్రధాని మోడీకి యూఏఈ సత్కారం.. బుర్జ్ ఖలీఫాపై వెలిగిపోయిన త్రివర్ణ పతాకం..

Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.


మంగళవారం ప్రధాని మోడీ, యూఏ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై పరస్పరం చర్చించారు. ఇంధనం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వంటి కీలక రంగాలలో సహకారం కోసం రెండు దేశాలు 10 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, మంగళవారం రోజు భారత జెండా, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లోగోలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన చిత్రాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఇదే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు అబుదాబిలో నిర్మితమవుతున్న మధ్యప్రాచ్చంలోనే అతిపెద్దదైన హిందూ ఆలయాన్ని ఈ రోజు ప్రధాని మోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు.

828 మీటర్లు (2,716.5 అడుగులు), 160 కంటే ఎక్కువ అంతస్తులతో, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన అవుట్‌డోర్ అబ్జర్వేషన్ డెక్‌ను కలిగి ఉంది, ప్రపంచంలోనే అత్యధిక ప్రయాణ దూరం ఉన్న ఎలివేటర్‌ను కలిగి ఉంది.