Leading News Portal in Telugu

Same Gender Marriage: స్వలింగ పౌర వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్..


Same Gender Marriage: స్వలింగ పౌర వివాహాలకు గ్రీస్ గ్రీన్ సిగ్నల్..

Greece: ప్రపంచ వ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సేమ్‌-సెక్స్‌ మ్యారేజీని లీగల్‌ చేసిన జాబితాలలో గ్రీస్‌ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు.. ఈ బిల్లు ఆమోదం LGBT సమాజం గ్రీస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.


అయితే, స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి మెజారిటీ ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్‌ నిలిచింది. యూరోపియన్ యూనియన్ లోని 27 సభ్యదేశాల్లో 15 దేశాలు ఇప్పటికే ఈ వివాహాన్ని చట్టబద్ధం చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో దీనికి పర్మిషన్ ఉంది. స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవడంతో పాటు పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. 300 స్థానాలున్న పార్లమెంటులో 176 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఇది చట్ట రూపం దాల్చింది.

ఇక, సంప్రదాయవాద దేశమైన గ్రీస్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అయితే దశాబ్దాలుగా గ్రీస్‌లోని LGBT కమ్యూనిటీ వివాహ సమానత్వం కోసం పోరాటం చేస్తుంది. దాని ఫలితమే ఇవాళ ఈ బిల్లుకు ఆమోదం లభించింది. చర్చి, మితవాద రాజకీయ నాయకుల ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఉద్యమకారులు దశాబ్దాలుగా మార్పు కోసం ట్రై చేస్తున్నారు. 2008లో ఒక లెస్బియన్, గే జంట చట్టాన్ని ఉల్లంఘించి టిలోస్ అనే చిన్న ద్వీపంలో పెళ్లి చేసుకుంది. కానీ వారి వివాహాలను ఉన్నత న్యాయస్థానం క్యాన్సిల్ చేసింది.. తమ మతాచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దే గ్రీస్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్లు ఈ స్వలింగ వివాహ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బైబిల్ కు వ్యతిరేఖమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.