Leading News Portal in Telugu

US Mobile Network: టెలికాం సేవల్లో అంతరాయం.. ప్రజలు ఇక్కట్లు



Us Me

మొబైల్ అనేది మనిషికి నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. తినేటప్పుడు.. పడుకునేటప్పుడు.. ప్రయాణాల్లో.. ఇలా ప్రతి సందర్భాల్లో చేతిలో మొబైల్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టే ఫీలవుతారు. ఛార్జింగ్ లేకపోయినా.. డేటా అయిపోయినా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది అగ్రరాజ్యం అమెరికాలో టెలికాం సేవల్లో తీవ్ర అంతారాయం ఏర్పడింది. అంతే ప్రజలు అయోమయం.. గందరగోళానికి గురయ్యారు.. ఏమైందో.. ఏంటో తెలుసుకునేందుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఆగమాగం అయిపోయారు.

అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో (Mobile Networks) కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.

ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 31 వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా.. టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సిఉంది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.