
Jihadi bride: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, కరుగుగట్టిన సిరియాలోని ఐఎస్ఐఎస్‌లో చేరిన బ్రిటీష్ యువతి తన పౌరసత్వాన్ని కోల్పోయింది. ఈ కేసును అక్కడి కోర్టులో ఛాలెంజ్ చేసిన సదరు యువతి, కేసును కోల్పోయింది. ‘జీహాదీ వధువు’గా పేరు పొందిన బ్రిటీష్ యువతి షమీమా బేగం పౌరసత్వం రద్దును కోర్టు సమర్థించింది. 15 ఏళ్ల వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ఆకర్షితమైన షమీనా బేగం తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి సిరియా వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంది.
Read Also: PM Modi: “మతిలేని వాళ్లు ఇలాగే అంటారు”.. రాహుల్ గాంధీపై పీఎం ఆగ్రహం..
బంగ్లాదేశ్ మూలాలు ఉన్న తల్లిదండ్రులకు షమీమా బ్రిటన్‌లో జన్మించింది. 15 ఏళ్ల వయసులోనే ఉగ్ర సంస్థలో చేరేందుకు బ్రిటన్ నుంచి వెళ్లిపోయింది. శుక్రవారం ఈమె పౌరసత్వ కేసును కోర్టు విచారించింది. పౌరసత్వం పునరుద్ధరణ కోసం ఆమె చేసుకున్న వాదనల్ని శుక్రవారం అప్పీళ్ల కోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు తోసిపుచ్చారు. 2019లో ఈమె పౌరసత్వాన్ని రద్దు చేస్తూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమె ప్రమాదకరమని అప్పటి యూకే హోమంత్రి సాజిద్ జావిద్ చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ప్రస్తావించింది.
ప్రస్తుతం ఈమె ఈశాన్య సిరియాలోని అల్-రోజ్ నిర్బంధ శిబిరంలో నివసిస్తోంది. 2023లో బీబీసీతో మాట్లాడుతూ.. జైలులో ఉండటం కన్నా ఇక్కడ దారుణంగా ఉందని, కనీసం జైలు శిక్షలో ముగింపు ఉంటుందని తెలుసు, కానీ ఇక్కడ అలాంటి ముగింపు ఉండదని వ్యాఖ్యానించింది. షమీమా బేగంతో వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు కదీజా సుల్తానా, అమీరా అబాసేలు అక్కడే ఘర్షణల్లో చంపబడ్డారు. షమీమా మూడేళ్లకు పైగా ఐసిస్ పాలనలో నివసించింది. ఆమె సిరియాలోనే డచ్ ఐఎస్ ఫైటర్‌ని వివాహం చేసుకుని ‘ఐసిస్ వధువు’, ‘జిహాదీ వధువు’గా ప్రాచుర్యం పొందింది. ఈమె 2019లో సిరియన్ శరణార్థి శిబిరంలో కనిపించింది. తనను యూకేలోకి తిరిగి రానివ్వాలని అభ్యర్థించింది. భద్రతా కారణాల వల్ల యూకే ఈమె పౌరసత్వాన్ని తొలగించింది.