
పాకిస్థాన్ ఎన్నికలు (Pakistan Election) ముగిసి.. ఫలితాలు వెలువడినా ఇంకా అక్కడ రాజకీయ సంక్షోభం వీడలేదు. ఏ పార్టీకి సంపూర్ణ మద్దతు లభించలేదు. తాజాగా నవాజ్ షరీఫ్ పార్టీ.. భుట్టో పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఓ అధికారి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పార్టీ ఎన్నికల్లో గెలవకుండా రిగ్గింగ్ చేసి ప్రజా తీర్పును దొంగిలించాలని ఆయన ఇదివరకే వ్యాఖ్యానించారు. తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి తన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ మొత్తం 180 సీట్లు గెలుచుకుందని, అయితే రిగ్గింగ్ వల్ల ఆ స్థానాలు 92కు పడిపోయాయని ఇమ్రాన్ తెలిపారు.
ఇప్పటికే ఎన్నికలు రద్దు చేయాలని పిటిషన్ వేసిన ఒక ఆర్మీ అధికారికి సుప్రీంకోర్టు జరిమానా విధించిన నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. 266 నేషనల్ అసెంబ్లీ సీట్లలో మొత్తం 133 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం చేపడుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి కావాల్సిన మెజారిటీ రాలేదు. దీంతో నవాజ్‌షరీఫ్‌కు చెందిన పీఎంఎల్(ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కదుర్చుకున్నారు. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇంతలో ఇమ్రాన్‌ఖాన్ న్యాయస్థానానికి వెళ్లారు. కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.