Leading News Portal in Telugu

Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..



Point Nemo 1.

Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. ఈ పాయింట్ నిమో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇది అంటార్కిటికా నుంచి ఉత్తరాన 3000 మైళ్లు, న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో ఉంది.

Read Also: Ravi River: పాకిస్తాన్‌కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..

భూమిపైనే అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో, ఈ ప్రాంతానికి సమీపంలో మానవ సంచారం లేకపోవడంతో అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా చేస్తుంటారు. కాలం చెల్లిన ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష వస్తువులను ఈ ప్రాంతంలో కూలిపోయేలా చేస్తారు. 2030లో ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోతుంది, ఆ సమయంలో ఐఎస్ఎస్ ‘పాయింట్ నిమో’ వద్దే కూలి సముద్రగర్భంలో కలిసిపోతుంది. అందుకే దీనిని ‘అంతరిక్ష వ్యర్థాల శ్మశానవాటిక’గా పిలుస్తుంటారు.

Point Nemo

భూమిపై అత్యంత సుదూర ప్రదేశం పాయింట్ నెమోని కొన్నిసార్లు ‘ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ’ లేదా ‘దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం’గా సూచిస్తారు. 1992లో, కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్ర్వోజే లుకటేలా దాని ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను గుర్తించాడు. 2019 అధ్యయనం ప్రకారం..ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయాయి. నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చబడ్డాయి. నిజానికి ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ.. ఈ సముద్రం అడుగుభాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయి.