
ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అశాంతి నెలకొంది. ఏ న్యూస్ చూసినా కరవులు, కాటకాలు, యుద్ధాలు, బాంబు పేలుళ్లు, నరమేధం… ఇలా ఒక్కటేంటి?.. ప్రతీ రోజూ ఏదొక చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో రోజు రోజుకు రక్షణ కరవవుతోందని ఐక్యరాజ్యసమితి (United Nations) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Guterres) వాపోయారు.
ప్రపంచ శాంతికి పునాది వంటి మానవ హక్కులపై ఎన్నో రకాలుగా దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. మయన్మార్, ఉక్రెయిన్, కాంగో, గాజా, సుడాన్ వంటి ప్రాంతాల్లో కొనసాగుతోన్న పోరాటాలు అంతర్జాతీయ చట్టానికి గుడ్డి కన్నుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రపంచంలో రోజురోజుకు రక్షణ కరవవుతోందని వార్నింగ్ ఇచ్చారు. మానవ హక్కులకు, ప్రపంచ శాంతికి అత్యంత గౌరవం ఇవ్వాలని ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు.
గాజాలో ఉన్న పాలస్తీనా శరణార్థి శిబిరాన్ని తొలగించాలని ఇజ్రాయెల్ పేర్కొనడాన్ని వ్యతిరేకించిన గుటెరస్.. అక్కడ సహాయ కార్యక్రమాలకు అది వెన్నెముక వంటిదన్నారు.