Leading News Portal in Telugu

Pakistan: రావి నది ప్రవాహాన్ని నిలిపేసిన భారత్.. ఇది “వాటర్ టెర్రరిజం” అంటూ పాక్ గగ్గోలు..



Pakistan

Pakistan: సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్‌కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, మనకు హక్కుగా ఉన్న నీటిని ఉపయోగించుకోనున్నాం.

అయితే, ఇన్నాళ్లు అప్పనంగా రావీ నదీ జలాలను అనుభవించిన పాకిస్తాన్ ఈ విషయంపై తన అక్కసు వెళ్లగక్కుతోంది. అక్కడి మీడియా భారత్ ‘వాటర్ టెర్రరిజం’కి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నాయి. రావి నదీ జలాలను పరిరక్షించాలని, సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ లాహోర్‌లో ప్రజలు భారీ ర్యాలీ చేశారు. నిజానికి రావి నది నీటిపై భారత్‌కి ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ.. పాక్ మీడియా మాత్రం భారత్‌ని బద్నాం చేసే విధంగా వార్తల్ని ప్రచురిస్తోంది. లాహోర్‌లో ప్రజలు భారత్-పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.

Read Also: Abu Dhabi: మోడీ ప్రారంభించిన దేవాలయంపై అప్‌డేట్ ఇదే!

రావి నదిపై ఉన్న షాపూర్‌కండి ప్రాజెక్ట్ భారతదేశానికి ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది, జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్‌లోని 37,000 హెక్టార్ల భూమిలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తుంది మరియు 206 మెగావాట్ల శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు రావి నదికి ఉపనది అయిన ఉజ్ నదిపై జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టును భారత్ నిర్మిస్తోంది. దీని ద్వారా 781 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇటీవల సింధు నది మరో ఉపనది అయిన ‘చీనాబ్’ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూకాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు‌ని వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లు, పాకిస్తాన్‌కి పశ్చిమ నదులు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.