
గత రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయినా యుద్ధం మాత్రం ఆగలేదు. ఈ పరిణామాలు ఎంత వరకు దారి తీస్తాయో అర్థం కాక ప్రపంచ అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ మధ్య అక్కడి ప్రతిపక్ష నేత నావల్నీ హత్యకు గురయ్యారు. ఈ పరిణామాల్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఇప్పుడు రష్యా గురి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైపునకు మళ్లినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky), గ్రీక్ ప్రధాని కిరియాకోస్ మిత్సటాకోస్ ప్రాణాంతక దాడి నుంచి తప్పించుకొన్నట్లు సమాచారం. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి వారి కాన్వాయ్‌కు కేవలం 500 మీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నల్ల సముద్ర తీరంలో చోటు చేసుకుంది.
ఉక్రెయిన్ పర్యటనకు వచ్చిన గ్రీక్ ప్రధాని కిరియాకోస్‌తో కలిసి జెలెన్స్కీ నగర సందర్శనకు బయల్దేరిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు.
యుద్ధం మొదలైనప్పటి నుంచి జెలెన్స్కీ యుద్ధ క్షేత్రాల్లోని సైనికులను ఉత్సాహపర్చేందుకు పర్యటనలు చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రపంచ నాయకులను కూడా తీసుకెళుతున్నారు. బుధవారం నాటో సభ్యదేశమైన గ్రీక్ ప్రధాని ఉండగానే ఈ దాడి జరగడం గమనార్హం.
క్షిపణి దాడిపై జెలెన్స్కీ మాట్లాడుతూ తాను ఈ రోజు జరిగిన దాడిని చూశానన్నారు. మనం ఎలాంటి వారిని ఎదుర్కొంటున్నామో మీరు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ దాడిలో కొందరు మరణించినట్లుగా తెలిసిందన్నారు. ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా నగరంలో జరిగిన నష్టాన్ని గ్రీకు ప్రధానికి జెలెన్స్కీ చూపించారు.