
ఏ పనైనా చేసేటప్పుడు ఆచితూచి చేయాలంటారు పెద్దలు. లేదంటే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. సిడ్నీలో తాజాగా వెలుగు చూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ తప్పిదం కారణంగా ఏకంగా రూ.24 కోట్ల విలువైన ఓ ఇల్లు బుగ్గిపాలైంది. ఇంటి స్టోర్ రూమ్‌లో లైట్ వేసి ఉంచడంతో అగ్నిప్రమాదం జరిగి మూడు మిలియన్ డాలర్ల (సుమారు రూ.24 కోట్లు) విలువైన ఇల్లు బూడిదగా మారింది.
సిడ్నీలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జూలీ బండోక్ అనే మహిళ పని చేస్తోంది. అవలోన్ బీచ్ సమీపంలో ఖాళీగా ఉన్న ఇంట్లో ఓ వాటాను పరిశీలించేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు బాల్కనీలో పరుపు కనిపించింది. అంతకుముందు ఆ వాటాలో అద్దెకున్నవాళ్లు దాన్ని మర్చిపోయి ఉంటారని భావించి బెడ్ రూమ్ కింద ఉన్న స్టోర్ రూమ్‌లో పెట్టింది. ఆ తర్వాత అందులో ఉన్న లైట్ ఆన్ చేసి పైకి వచ్చేసింది. 20 నిమిషాల తర్వాత ఇల్లంతా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో స్టోర్ రూమ్ నుంచి మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. చాలాసేపు లైటు వేసి ఉంచడంతో వేడెక్కి పరుపు కాలిపోయి ఇల్లంతా మంటలు వ్యాపించాయని తెలిపారు. స్టోర్ రూమ్‌లో తానే ఉంచినట్లు జూలీ అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ప్రమాదానికి జూలీ బాధ్యురాలని, బాధితులకు ఆమె నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.