
Pakistan: పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో రెండు రోజుల క్రితం జరిగిన మిలిటెంట్ దాడిలో ఐదుగురు చైనీయులు చనిపోయారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) ప్రాజెక్టులో భాగంగా పనిచేస్తు్న్న చైనా జాతీయులే టార్గెట్గా ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడిపై అటు చైనా, ఇటు పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా-పాకిస్తాన్ స్నేహానికి శత్రువులే ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ గురువారం పేర్కొంది. నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించింది.
Read Also: Taj Mahal: తాజ్ మహల్ని శివాలయంగా ప్రకటించాలి.. విచారణకు స్వీకరించిన కోర్టు..
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని షాంగ్లా జిల్లాలో పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న వాళ్లంతా దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఈ పేలుడులో కనీసం ఐదుగురు చైనా జాతీయులు మరణించారు. వారితో పాటు డ్రైవర్ కూడా మరణించాడు. 2021 నుంచి చైనా నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిపై ఇది రెండో ఆత్మాహుతి దాడి.
ఈ దాడిపై పాకిస్తాన్, చైనా ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు. పాక్-చైనా సన్నిహిత సోదరులని, రెండు దేశాల స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడికి పాల్పడినట్లు ఆమె అన్నారు. ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పారు. పాక్, చైనాలు ఉగ్రవాదులపై కృతనిశ్చయంతో వ్యవహరిస్తాయని, వారిని ఓడించాలని ఆమె అన్నారు. పాకిస్తాన్ లోని చైనా పౌరులకు, ప్రాజెక్టులకు రక్షణ, భద్రత ఇవ్వడానికి పాకిస్తాన్, చైనాతో కలసి పనిచేస్తూనే ఉంటుందని చెప్పింది.