Leading News Portal in Telugu

Babar Azam: మళ్లీ అతని చేతికే జట్టు పగ్గాలు..



Babar Ajam

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్‌ అజామ్‌కు మళ్లీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పీసీబీ (Pakisthan Cricket Board). వన్డే వరల్డ్ కప్‌ తర్వాత బాబర్ ఆజం.. పాకిస్థాన్‌ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత.. అతని స్థానంలో టీ20లకు షహీన్‌ అఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.

అయితే.. వారిని నియమించిన తర్వాత అనుకున్నంత స్థాయిలో జట్టుకు విజయాలు లేకపోవడం, రాణించకపోవడంతో మళ్లీ బాబర్ వైపు చూసింది. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచ కప్‌ సమీపిస్తున్న తరుణంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు బాబర్‌ అజామ్‌ను తిరిగి నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు పీసీబీ కీలక ప్రకటన జారీ చేసింది. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు.. బాబర్‌ అజామ్‌కు మళ్లీ పరిమిత ఓవర్ల జట్టు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ మోసిన్‌ నక్వీ తెలిపారు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాక్‌ 1-4 తేడాతో కోల్పోయింది. అప్పుడు పాక్‌ కెప్టెన్ గా షహీన్ బాధ్యతలు వహించాడు. కాగా.. కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాస్త సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తన అల్లుడు షహీన్‌ను షాహిద్‌ వెనుకేసుకొచ్చాడు. కాగా.. ఇప్పుడు షహీన్‌ను తప్పించి మళ్లీ బాబర్‌కే బాధ్యతలు అప్పజెప్పింది. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయితే.. జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరగనుంది.