Leading News Portal in Telugu

Boat Sink: విషాదం.. పడవ మునిగి 90 మంది మృతి..



Boat Sink

Boat Sink: పడవ మునిగి 90 మంది మరణించారు. ఈ విషాదకర సంఘటన మొజాంబిక్‌లో చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర తీరంలో పడవ మునిగిపోవడంతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపుగా 130 మందితో ఉన్న ఫిషింగ్ బోట్ నాంపులా ప్రావిన్స్‌లోని ఒక ద్వీపానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Himachal Pradesh: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరు మృతి, పలు వాహనాలు దగ్ధం

బోటులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం, ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి అనువుగా లేకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు, ఈ ప్రమాదంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారని నంపులా రాష్ట్ర కార్యదర్శి జైమ్ నెటో వెల్లడించారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ కార్యక్రమాల్లో ఐదుగురిని ప్రాణాలతో రక్షించారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. అయితే, సముద్రంలోని పరిస్థితులు కష్టంగా ఉండటంతో రెస్క్యూ కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చాలా మంది ప్రయాణికులు కలరా గురించి తప్పుడు సమాచారం కారణంగా భయాందోళనలతో ప్రధాన భూభాగాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత పేదదేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో అక్టోబర్ నుంచి దాదాపుగా 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. వీరిలో 32 మరణాలు సంభవించాయి. ఎక్కువగా నంపులా ప్రావిన్స్ ప్రభావితమైంది. కలరా కేసుల్లో మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ఇదిలా ఉంటే పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.