Leading News Portal in Telugu

US: అమెరికాలో కిడ్నాపైన హైదరాబాద్ స్టూడెంట్ హత్య



Eue

అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. అమెరికాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌ విగత జీవిగా ప్రత్యక్షమయ్యాడు. తిరిగి క్షేమంగా వస్తాడని భావించిన కుటుంబ సభ్యులకు విషాదమే మిగిలింది. కుమారుడి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తమ కుమారుడు అమెరికాలో కిడ్నాప్‌కు గురయ్యాడని.. దుండుగులు ఫోన్ చేసి బెదిరించారని బాధితుడి తండ్రి మీడియాకు తెలియజేశారు. అడినంత డబ్బు ఇవ్వకపోతే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించారని వాపోయారు. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని తెలిపింది. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.

హైదరాబాద్‌ నాచారంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ సలీమ్‌ కుమారుడు అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. నిత్యం ఫోన్‌లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్‌ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్‌ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లా ఖాన్‌ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్‌ బంధువులు క్లీవ్‌లాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. అబ్దుల్‌ అరాఫత్‌ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్‌ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.