
పాకిస్థాన్‌లో రంజాన్ షాపింగ్‌లే లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారు. బలూచిస్థాన్‌లో ఉగ్రవాదులు ఘోరమైన పేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నారు. కుచ్లక్‌లోని మసీదు, ఖుజ్దార్ మార్కెట్ లక్ష్యంగా బాంబు దాడులు చోటుచేసుకున్నాయి. పేలుళ్లలో ఐఈడీలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ గ్రూప్ కూడా పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఈద్ షాపింగ్ కోసం మార్కెట్‌లో మహిళలు, పిల్లలతో జనసందోహం ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ పేలుడు ఒక పోలీస్‌తో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని పేర్కొన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రిమోట్ కంట్రోల్‌తో బాంబు పేల్చినట్లు వెల్లించారు. ఇక పేలుళ్లకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టాక.. ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడంతో పాటు, చారిత్రక సంబంధాలు, ద్వైపాక్షిక సహకారం మరియు వివిధ రంగాలలో మరింత అభివృద్ధికి అవకాశాలను సమీక్షించినట్లు తెలుస్తోంది.