
ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, గాజా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. భవంతలు నేలకూలిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో దేశం యుద్ధాన్ని కోరుకుంటుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. దీంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తం అయింది. తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌ను అలర్ట్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్రమత్తం అయ్యారు.
పశ్చిమాసియాలో మరో యుద్ధం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమాన్ని ఇరాన్ ఏ మాత్రం సహించలేకపోతుంది. పైగా ఇటీవల ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో పలువురు ఇరానీయులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరింత పగ, ప్రతీకారంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. ఈ ప్రకటనతో ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ దాడులు గురించి అమెరికా కూడా హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అయితే ఇజ్రాయెల్‌పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని.. లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హిజ్బుల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యుద్ధ భయంతో టెహ్రాన్‌కు ఈ నెల 13 వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు జర్మనీ ఎయిర్‌లైన్స్ లుఫ్తాన్సా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్, పాలస్తీనియన్ వంటి పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణించవద్దంటూ రష్యా విదేశాంగ శాఖ కూడా తన పౌరులను హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని బైడెన్ తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఇప్పటికే అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. నెతన్యాహును నమ్మొద్దంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇరాన్ సూచించింది. ఒకవేళ జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు.. ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.