Leading News Portal in Telugu

Sydney mall Attack: సిడ్నీ మాల్ కత్తిపోటు దాడిలో 6కి చేరిన మృతుల సంఖ్య.. అనుమానితుడి కాల్చివేత..



Sydney

Sydney mall Attack: ఆస్ట్రేలియా సిడ్నీ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం సిడ్నీ నగరంలోని బోండీ జంక్షన్‌‌లో రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో అగంతకుడు జరిపిన కత్తి దాడిలో మరణాల సంఖ్య ఆరుకి చేరింది. ఏడుగురు గాయపడ్డారు. అనుమానితుడిని పోలీసులు కాల్చి చంపేశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక వ్యక్తి పెద్ద కత్తితో షాపింగ్ సెంటర్‌ చుట్టూ పరిగెత్తడం, గాయపడిన వ్యక్తులు నేలపై పడి ఉండటం అక్కడి సీసీకెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ప్రస్తుతం దాడి వెనక ఉద్దేశం ఏంటనేది తెలియరాలేదు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read Also: Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..

మరోవైపు ఈ ఘటనలో బోండి ఏరియాలో లాక్‌డౌన్ విధించారు. దుకాణాల్లో చిక్కుకున్న వారిని భద్రతా సిబ్బంది ఆ ఏరియా నుంచి సురక్షితంగా బయటకు పంపుతోంది. స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ దాడి చోటు చేసుకుంది. కత్తిపోట్లకు గురైన వారిలో ఓ తల్లి, ఆమె తొమ్మిది నెలల చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రమేయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన తర్వాత భయంతో ప్రజలు ఆ ప్రాంతాన్ని వదలివెళ్లడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.