Leading News Portal in Telugu

Iran: ఇరాన్ దాడి చేస్తుందని ఇజ్రాయిల్ భయపడుతోంది..



Iram Israel

Iran: సిరియాలో దాడి చేసిన తర్వాత ఇరాన్ ఎప్పుడు దాడి చేస్తోందో అని ఇజ్రాయిల్ భయపడుతోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు యాహ్యా రహీమ్ సఫానీ అన్నారు. జియోనిస్ట్(ఇజ్రాయిల్)పూర్తి భయాందోళనతో, అప్రమత్తంగా ఉన్నారని ఆయన శనివారం వ్యాఖ్యానించారు. ఇరాన్ ఏం చేయాలనుకుంటుందో వారికి తెలియదు, కాబట్టి వారు, వారి మద్దతుదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు అని ఆయన చెప్పారు. ప్రతీ రాత్రి కూడా దాడి కోసం ఇజ్రాయిల్ వేచిచూస్తోందని అన్నారు. ‘‘ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధం ఇజ్రాయిల్‌కి యుద్ధం కన్నా భయకరంగా ఉంది. ఎందుకంటే వారు ప్రతీ రాత్రి దాడి కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో చాలా మంది పారిపోయి షెల్టర్లకు వెళ్లారు’’ అని సఫానీ అన్నారు.

Read Also: Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు.. అన్నాడీఎంకేతో జతకట్టిన ఎంఐఎం

ఏప్రిల్ 1న సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్ ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు సభ్యులను చంపింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించలేదు. ఇరాన్ దాడి చేస్తుందనే వార్తల నేపథ్యంలో ఇజ్రాయిల్ దక్షిణ గాజాలోని తన సేనల్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, సైన్యానికి సెలవులు రద్దు చేసింది. వైమానిక రక్షణ నిర్వహించడానికి డ్రాఫ్ట్ రిజర్వ్ సైనికులను పెంచాలని అధికారులు నిర్ణయించారు.

ఏప్రిల్ 1 నాటి సిరియా దాడిలో ఇరాన్ అత్యున్నత జనరల్ మొహమ్మద్ రెజా జాహెదీ, మహ్మద్ హదీ హాజీ రహీమిలు మరణించారు. 2020లో బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో అమెరికా క్షిపణి దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఖాసి సులేమానిని చంపిన తర్వాత తాజాగా సిరియా దాడిలోనే ఇరాన్ తన అత్యున్నత సైనికాధికారుల్ని కోల్పోయింది. దీంతోనే ఆ దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయిల్-హమాస్ గాజా యుద్ధం నేపథ్యంలో సిరియాపై ఇజ్రాయిల్ దాడి జరిగింది. ఇజ్రాయిల్‌పై అక్టోబర్ 7నాటి హమాస్ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది.