Leading News Portal in Telugu

Israel-Iran: ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌.. అమెరికా కీలక ప్రకటన



Israel Iran

Israel-Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ ఏకకాలంలో ఇజ్రాయెల్ నగరాల వైపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ 99 శాతం డ్రోన్లు మరియు క్షిపణులను గాలిలో నాశనం చేసినట్లు పేర్కొంది. ఇరాన్ చేసిన ఈ దాడిలో అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు సహాయం చేసింది. యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ పెంటగాన్ ప్రకారం, ఇది 80 కంటే ఎక్కువ ఇరాన్ డ్రోన్‌లు (యూఎవీ), కనీసం ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసింది. ఇరాన్ లాంచర్ వాహనంపై అమెరికా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల్లో ఏడు యూఏవీలను కూడా ధ్వంసం చేసిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.శనివారం అర్ధరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ డ్రోన్‌లను ప్రయోగించిందని తెలిసిందే. వందలాది డ్రోన్లు, క్షిపణులు ఆకాశంలో ఏకకాలంలో ఇజ్రాయెల్ వైపు కదులుతున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భారత కాలమానం ప్రకారం, ఇజ్రాయెల్ ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాత్రి 3 గంటలకు ఇజ్రాయెల్ ఈ భారీ దాడి చేసింది.

Read Also: Seized Ship: నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్‌.. ఆ 17 మంది భారతీయ సిబ్బందికి కాస్త ఊరట

ఇరాన్‌ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్‌ హగేరీ పేర్కొన్నారు. ఇరాన్‌ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్‌ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని వెల్లడించారు. మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్‌ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్‌ బేస్‌కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని తెలిపారు. కాగా, తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్‌ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మహ్మద్‌ హుస్సేన్‌ భగేరీ పేర్కొన్నారు. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్‌ చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. రెండు వారాల క్రితం సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ తాజా దాడులు చేసింది.

Read Also: Devyani Khobrogade​: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి

ఇరాన్ దాడిని ఊహించి, ఇజ్రాయెల్ అప్పటికే పాఠశాలలను మూసివేసింది. సైన్యాన్ని అప్రమత్తం చేశారు. నిజానికి ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీ దగ్గర దాడి చేసింది. ఇది తమ ప్రతీకారం అని ఇరాన్ అంటోంది. ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో, ఇరాన్ టాప్ కమాండర్‌తో సహా చాలా మంది సైనిక అధికారులు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. అప్పటి నుంచి ఇరాన్ ఇలాంటి దాడికి పాల్పడుతుందనే భయం నెలకొంది. ఈ దాడి ప్రతిదాడుల అనంతరం అమెరికా కూడా ఇరాన్‌పై దాడి చేయవద్దని హెచ్చరించింది. దాడి చేస్తే ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బెదిరించింది.

ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఈ సంభాషణలో ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్‌పై దాడికి దిగొద్దని.. కాదని దాడి చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదని.. మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయమని.. ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిదాడులకు దిగడం అనవసరమని అని బైడెన్‌ తన అభిప్రాయాన్ని నెతన్యాహుతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోసారి దాడి జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితి చేయి దాటి పోతుందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.