Leading News Portal in Telugu

Dubai Rains: ఇది ముంబై కాదు దుబాయ్.. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే!



Dubai Rains

Anand Mahindra Tweet on Dubai Rains 2024: సాధారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఎండలు ఎక్కువ. ఎడారి దేశం కాబట్టి అక్కడ వర్షాలు తక్కువే. ఎప్పుడో కానీ.. భారీ వర్షాలు కురవవు. అలాంటి యూఏఈలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం (ఏప్రిల్ 16) బలమైన గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. దుబాయ్‌లో అయితే ఈ వర్ష బీభత్సం మరీ ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే.. ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది.

దుబాయ్‌లో సోమవారం (ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దాంతో దుబాయ్‌లో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది. దుబాయ్‌లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో నిత్యం రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయి.. ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Also Read: KKR vs RR: ధోనీ, కోహ్లీలే నా ఇన్స్పిరేషన్: జోస్ బట్లర్

దుబాయ్‌లో వర్షపు నీరు రోడ్లపై పరుగులు పెడుతోంది. ఆ నీటిలోనే వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. మరోవైపు అధికారులు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్‌కు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘ఇది ముంబై కాదు.. దుబాయ్’ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా చాలా అరుదు. కానీ గత 2-3 ఏళ్లుగా ఇలా కుంభవృష్టి కురుస్తోంది. వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు.