Leading News Portal in Telugu

Hamas Targets Israel: రాకెట్లతో ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్..


  • ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి..

  • రాకెట్‌తో టెల్ అవీవ్‌పై అటాక్..
Hamas Targets Israel: రాకెట్లతో ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్..

Hamas Targets Israel: హమాస్‌కి చెందిన సాయుధ విభాగం ఆల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ మంగళవారం ఇజ్రాయిల్ వాణిజ్య నగరం టెల్ అవీవ్‌పై దాడి చేసింది. “M90” రాకెట్లతో నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసింది. గాజా నుంచి కొద్ధి సమయం క్రితం ఒక రాకెట్ లాంచ్ డిటెక్ట్ చేయబడిందని, దేశం మధ్యలో ఉన్న సముద్ర ప్రదేశంలో పడిందని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. టెల్ అవీవ్‌లో శబ్ధాలు వినిపించాయని అయితే ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు లేవని ఇజ్రాయిల్ మీడియా నివేదించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో హమాస్-ఇజ్రాయిల్ చర్చలు జరుపుతున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం మధ్య, దక్షిణ గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. గురువారం జరగాల్సిన శాంతి చర్చలు అనుకున్న విధంగానే సాగుతాయని భావిస్తున్నామని, కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా సాధ్యమేనని అమెరికా సోమవారం తెలిపింది. ఖతార్, ఈజిప్ట్, ఇజ్రాయిల్ చర్చల కోసం యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోని బ్లింకెన్ మంగళవారం బయలుదేరాలని యోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇటీవల హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయిల్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే, ఈ హత్యకు ఇజ్రాయిల్ మాత్రం బాధ్యత వహించలేదు. హనియే హత్యకు తప్పక ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మధ్యప్రాచ్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇరాన్ ఈ వారంలో ఇజ్రాయిల్‌పై దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరిస్తోంది.