Leading News Portal in Telugu

Monkeypox: మంకీపాక్స్ వైరస్ కారణంగా ఆ దేశంలో 548 మంది మృతి..


  • డీఆర్ కాంగోలో విజృంభిస్తున్న మంకీపాక్స్..

  • ఏడాదిలో 548 మంది మృతి..

  • ఆఫ్రికా అంతటా హై అలర్ట్..

  • హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ..
Monkeypox: మంకీపాక్స్ వైరస్ కారణంగా ఆ దేశంలో 548 మంది మృతి..

Monkeypox: ప్రపంచాన్ని ‘‘మంకీపాక్స్’’ భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికాలో ఉప్పెన కేసులు పెరుగుతుండటంతో బుధవారం ఈ వ్యాధిని ‘‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’’గా ప్రకటించింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలో ఏడాది కాలంలో 548 మంది మరణించార. దాదాపు దేశంలోని అన్ని ప్రావిన్సులు ఈ వ్యాధి బారిన పడినట్లు ఆ దేశ ఆరోగ్యమంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేసుల సంఖ్య పెరగడంతో ఇతర దేశాలకు కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజా ఎపిడెమియోలాజికల్ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభం నుండి డీఆర్ కాంగోలో 15,664 సంభావ్య కేసులు , 548 మరణాలు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కంబా ప్రకటించారు. కాంగోలోని 26 ప్రావిన్సుల్లో సుమారుగా 10 కోట్ల జనాభా ఉంది. దక్షిణ కివు, నార్త్ కివు, త్షోపో, ఈక్వేటూర్, నార్త్ ఉబాంగి, త్సుపా, మంగల మరియు సంకురు ప్రావిన్సులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని కంబా చెప్పారు.