Leading News Portal in Telugu

China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి


  • డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ

  • దేవుళ్లను కూడా వదలని దొంగలు

  • గుడిలో ఉండే హుండీకి క్యూఆర్ కోడ్

  • క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా చోరీ.
China: గుడిలో హుండీకి క్యూఆర్ కోడ్.. లక్షల్లో నొక్కేసిన ఓ వ్యక్తి

డబ్బుల కోసం మోసగాళ్లు సరికొత్త ఆలోచనలతో చోరీ చేస్తున్నారు. జనాలను మోసం చేయడమే కాకుండా.. ఇప్పుడు దేవుడు మీద కూడా పడ్డారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఓ వ్యక్తి గుడిలో ఉండే హుండీకి తన ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ను పెట్టాడు. దీంతో.. ఆ గుడికి వచ్చే భక్తులంతా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి కానులకు వేసేశారు. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 3 లక్షలకు పైగా వచ్చాయి. అయితే.. ఈ ఘరానా దొంగ లా గ్రాడ్యుయేట్ చేశాడు. ఈ వ్యవహారం చైనాలోని బౌద్ధ ఆలయంలో చోటు చేసుకుంది. కాగా.. ఈ ఘటనలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. చర్యలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గుడికి వచ్చే భక్తులు.. హుండీలో డబ్బులు వేయాల్సింది పోయి, క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేసే వారన్నారు. దీంతో అతని ఖాతాలో నగదు బదిలీ అయ్యేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షాంగ్సీ పోలీసులు విడుదల చేశారు. అయితే.. ఈ వీడియో ఫుటేజీ బయటపడకుండా ఉంటే ఇలానే కొనసాగుతూ ఉండేది.

కాగా.. ఆ వ్యక్తి యొక్క వివరాలను పోలీసులు తెలుపలేదు. ఈ ఏడాది అతను వాయువ్య షాంగ్సీ ప్రావిన్స్‌, నైరుతి సిచువాన్‌, చాంగ్‌కింగ్‌ ప్రావిన్స్‌లలోని బౌద్ధ దేవాలయాల్లో ఈ మోసానికి పాల్పడ్డానని, దాదాపు 4,200 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ. 3.5 లక్షలు) దొంగిలించానని అతడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కాగా.. నిందితుడు ఇప్పటివరకు దోచుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ సంఘటన చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఇప్పుడు మోసం చేసేందుకు దేవుడి గుడిని కూడా వదలడం లేదని ప్రజలు అంటున్నారు.