Leading News Portal in Telugu

Modi-Biden telephonic call: పీఎం మోడీ, వైట్ హౌస్ పరస్పర విరుద్ధ ప్రకటన..


  • ప్రధాని మోడీ ప్రకటనకు విరుద్ధంగా వైట్‌హౌజ్ ప్రకటన..

  • బంగ్లాదేశ్..హిందువులపై దాడులను ప్రస్తావించిన యూఎస్..
Modi-Biden telephonic call: పీఎం మోడీ, వైట్ హౌస్ పరస్పర విరుద్ధ ప్రకటన..

Modi-Biden telephonic call: రెండేళ్ల నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సంక్షోభాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించారు.

ఇదిలా ఉంటే, ఈ పర్యటన తర్వాత ప్రధాని మోడీ అమెరికి ప్రెసిడెంట్ జో బైడెన్‌తో మాట్లాడారు. బంగ్లాదేశ్ సంక్షోభం, మైనారిటీల భద్రత, ముఖ్యంగా హిందువుల భద్రతపై ఇరువురం చర్చించినట్లు ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే, వైట్‌హౌజ్ ప్రకటనలో మాత్రం బంగ్లాదేశ్ పరిస్థితి, షేక్ హసీనా బహిష్కరణకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు.

వైట్‌హౌజ్ ప్రకటనలో వచ్చే నెల సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల గురించి, ఇటీవల ఉక్రెయిన్ పర్యటన గురించి చర్చించినట్లు తెలిపింది. ప్రధాని మోడీ శాంతి కార్యక్రమాలను ప్రశంసించింది. ‘‘దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి పోలాండ్ మరియు ఉక్రెయిన్‌లలో చేసిన చారిత్రాత్మక పర్యటనని, ఉక్రెయిన్‌కు శాంతి సందేశం, కొనసాగుతున్న మానవతా మద్దతు కోసం ప్రధాని మోడీ చొరవ చూపడంపై బైడెన్ ప్రశంసించారు’’ అని ప్రకటన పేర్కొంది. యూఎన్ చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంఘర్షణకి శాంతియుత పరిష్కారాన్ని ఇరువురు నేతలు మద్దతు ఇచ్చారని తెలిపింది.

చైనా గురించి ప్రస్తావించకుండా, వైట్ హౌస్ ప్రకటన క్వాడ్‌పై చర్చించినట్లు తెలిపింది. ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సుకు దోహదపడేందుకు క్వాడ్ వంటి ప్రాంతీయ కూటములతో కలిసి పనిచేయడానికి నాయకులు తమ నిరంతర నిబద్ధతను నొక్కి చెప్పినట్లు తెలిపింది.