- తెలంగాణ వ్యక్తిని చంపేసిన సౌదీ ఎడారి..
-
రబ్ అల్ ఖలీలో చిక్కుకుంటే చావే గతి.. -
ప్రపంచంలో ప్రమాదకరమైన ఎడారిగా పేరు..

Rub al Khali Desert: తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. రబ్ అల్ ఖలీ ఎడాదిలో దిక్కుతోచని స్థితిలో జనావాసాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో అధిక అలసట, డీహైడ్రేషన్‌తో విషాదకరమైన స్థితిలో మరణించాడు. సౌదీలోని అల్ హసా ప్రాంతంలో టెలికాం కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్న మహ్మద్ షెహజాద్ ఇటీవల తన సహచరుడితో కలిసి ఎడారి ప్రాంతానికి వెళ్లాడు. జీపీఎస్ పరికరం తప్పుగా పనిచేయడం, వారి కారులో ఇంధనం అయిపోవడం, ఫోన్లలో సిగ్నల్స్ లేకపోవడంతో వారు ఎడారిలో చిక్కుకుపోయారు. జనావాసానికి దూరంగా వెళ్లడంతో ఆకలి, దప్పికతో పోరాడి ఓడిపోయారు. చివరకు ఎడాది వారిని తినేసింది.
‘‘రబ్ అల్ ఖలీ లేదా ఎమ్టీ క్వాటర్’’గా పిలువబడే ఈ ఎడాది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటి 650 కి.మీ పైగా విస్తరించి ఉన్న ఈ ఎడారి కఠిన పరిస్థితులకు నెలవు. ఏదైనా కారణం చేత అందులో చిక్కుకుపోతే, చావే గతి. సౌదీ అరేబియాతో పాటు సరిహద్దు దేశాల్లో కూడా ఈ ఎడారి విస్తరించి ఉంది. ఈ ఎడాది పేరులో ఉన్న ‘‘ఖలీ’’ అనే పదం ఖాళీ లేదా పూర్తి శూన్యతను సూచిస్తుంది. మైళ్ల వరకు అక్కడ ఏమీ కనిపించడు.
ప్రసిద్ధ అన్వేషకుడు విల్ఫ్రెడ్ థెసిగర్ ఈ ఎడాదిలో తన అనుభవాలను ఒక పుస్తకం రూపంలో తీసుకువచ్చాడు. రెండేళ్ల పాటు ఈ ఎడారిని అతను అన్వేషించాడు. బూట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చెప్పులు లేకుండా ఎడారిలో నడవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కార్లు ఉన్నా ఒంటెల ద్వారా ప్రయాణించాడు. ఎడారిలోని బెడౌయిన్స్ లేదా బేడు ప్రజలతో సంవత్సరాలు గడిపాడు. థెసిగర్ 1910లో అడిస్ అబాబాలో బ్రిటిష్ మంత్రి కుమారుడిగా జన్మించాడు. జనరల్ డయ్యర్ నేతృత్వంలో జలియన్‌వాలాబాగ్ మారణకాండ జరిగిన సమయంలో అతని మేనమామ ఫ్రెడరిక్ థెసిగర్ 1916 నుండి 1921 వరకు భారతదేశానికి వైస్రాయ్‌గా ఉన్నారు. ఈ సమయంలో జీపీఎస్ వంటి వ్యవస్థలు లేకున్నా, బెడౌయిన్ ప్రజలు అనుసరించే విధానాలపై ఆధారపడి ఎడాదిలో తన సొంత మ్యాప్‌ని రూపొందించాడు. ఈ ప్రాంతంలో రెండు, మూడు వందల అడుగుల ఇసుక దిబ్బలు గందరగోళానికి గురిచేస్తాయని చెప్పాడు.
7-8 దశాబ్ధాలుగా ఆధునిక సాహసికులు కూడా ఈ ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రస్తుత కాలానికి చెందిన అలీ అనే అన్వేషకుడు ఈ ప్రాంతం గురించి చెప్పిన మాటలు ఆ ఎడాది ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. ‘‘ఈ ఎడారిలో చిక్కుకోవడం బొడ్డు తానును కత్తిరించడం లాంటిది. మీకు ఆహారం, ఆక్సిజన్ లేకుండా పోతుంది’’ అని చెప్పాడు.