Leading News Portal in Telugu

Israeli Strikes: గాజాపై ఇజ్రాయిల్ దాడులు.. 48 మంది మృతి..


  • గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్..

  • పోలియో కార్యక్రమానికి ముందు దాడులు..

  • 48 మంది పాలస్తీనియన్లు మృతి..
Israeli Strikes: గాజాపై ఇజ్రాయిల్ దాడులు.. 48 మంది మృతి..

Israeli Strikes: గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. శనివారం గాజా స్ట్రిప్‌పై జరిగిన దాడుల్లో 48 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. పోలియో వ్యాక్సిన్ ప్రచారాన్ని ప్రారంభించే ముందు గాజాలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి దాదాపుగా 6,40,000 మంది పిల్లలకు పోలియో టీకాలు వేయడం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరిగే పోరాటంలో రోజూవారీ ఎనిమిది గంటల విరామంపై ఆధారపడి ఉంది.

శనివారం, గాజా స్ట్రిప్‌లోని ఎనిమిది చారిత్రాత్మక శరణార్థుల శిబిరాల్లో ఒకటైన నుసీరత్‌లోని వైద్యులు ప్రచారం ప్రారంభానికి 2,000 మందికి పైగా వైద్య , కమ్యూనిటీ వర్కర్లు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ దాడుల్లో తొమ్మిది మంది సభ్యులతో సహా కనీసం 19 మంది మరణించారని వైద్యులు తెలిపారు. గాజాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన వరుస దాడుల్లో మరో 30 మందికి పైగా మరణించారు. సెంట్రల్, దక్షిణ గాజా స్ట్రిప్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమ రఫాలోని టెల్ అల్ సుల్తాన్‌లో తమ సైనికులు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు తెలిపింది.

దశాబ్ధాల నాటి ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదంలో అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేయడంతో గాజా యుద్ధ ప్రారంభమైంది. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు 1200 మంది ఇజ్రాయిలీ పౌరుల్ని హతమార్చడమే కాకుండా, 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్‌ని నేలకూల్చే లక్ష్యంతో గాజాపై దాడులు చేస్తోంది. ఇప్పటికే ఈ హమాస్ పొలిటకల్ బ్యూరో ఛీప్ ఇస్మాయిల్ హానియేని హతమార్చడమే కాకుండా, దాని మిలిటరీ వింగ్ నాయకుడు మహ్మద్ డయిఫ్‌ని చంపేసింది. మరికొందరు కీలక కమాండర్లను హతమార్చింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 40 వేలకు పైగా సాధారణ పాలస్తీనా ప్రజలు మరణించారు.