Leading News Portal in Telugu

PM Modi @ Brunei: బ్రూనై దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ..


  • బ్రూనై దేశానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ..

  • మోడీకి ఘన స్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్
  • హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్..

  • ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు రాజకుటుంబీకులతో మోడీ భేటీ..
PM Modi @ Brunei: బ్రూనై దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ..

PM Modi @ Brunei: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (మంగళవారం) బ్రూనై దేశానికి చేరుకున్నారు. మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగ‌తం ప‌లికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మ‌ధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాల‌ను ఈ టూర్ లో బ‌లోపేతం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ట్వీట్‌లో “బ్రూనై దారుస్సలాంలో అడుగుపెట్టాను.. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నాం.. ముఖ్యంగా వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను పెంచడంలో ఈ పర్యటన ఎంతో ముఖ్యమైంది అన్నారు.

అలాగే, భారతదేశం- బ్రూనై దేశాల మధ్య 40 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పోస్ట్‌లో తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనైకు చేరుకున్నారు.. ఇది ఒక భారతీయ ప్రధానమంత్రి యొక్క మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన అని చెప్పుకొచ్చారు. ఇక, బ్రూనై పర్యటనలో సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా, ఇతర రాజకుటుంబ సభ్యులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన తర్వాత ప్రధాని మోడీ సింగపూర్ పర్యటనకు రేపు ( బుధవారం) సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు.