- గాజా నుంచి ఇజ్రాయిల్‌పై రాకెట్లు ప్రయోగించిన హమాస్..
-
అక్టోబర్ 07 నాటి దాడులకు ఏడాది పూర్తవుతున్న వేళ ఘటన..
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి. ఆదివారం దక్షిణ ఇజ్రాయిల్లోకి రాకెట్లు ప్రవేశించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. రేపటితో ఇజ్రాయిల్‌పై హమాస్ దాడికి ఏడాది పూర్తవుతుంది. చాలా ప్రొజెక్టైల్స్ ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఒక ప్రొజెక్టయిల్ని అడ్డగించినట్లు ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. హమాస్ దాడులు పూర్తయి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇజ్రాయిల్ వ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది.
అక్టోబర్ 07న గతేడాది హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మందిని క్రూరంగా హతమార్చింది. వందలాదిగా రాకెట్లను ప్రయోగించింది. పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు అని చూడకుండా హమాస్ మిలిటెంట్లు హత్యలకు పాల్పడ్డారు. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ మధ్య గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో 40000పైగా పాలస్తీనియన్లు మరణించారు. ప్రస్తుతం ఈ యుద్ధం హమాస్ నుంచి హిజ్బుల్లా, ఇరాన్ వైపుగా మారింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది.