Leading News Portal in Telugu

Hezbollah Deputy: ప్రాణ భయంతో దెబ్బకి ఇరాన్‌ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌..


  • ప్రాణ భయంతో ఇరాన్ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్..

  • అక్టోబర్‌ 5న నయీమ్‌ ఖాసిమ్‌ బీరుట్‌ను వీడిచినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడి..

  • ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్గా హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఉండటంతోనే ఇరాన్ జంప్..
Hezbollah Deputy: ప్రాణ భయంతో దెబ్బకి ఇరాన్‌ పారిపోయిన హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌..

Hezbollah Deputy: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తుంది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే టార్గెటుగా వరుస దాడులు చేస్తూ వస్తుంది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా సహా పలువురు కీలక నేతలను చంపేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌ గా ఉన్న నయీమ్‌ ఖాసిమ్‌ ప్రాణ భయంతో లెబనాన్‌ను వదిలి పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ చీఫ్ ఖాసిమ్ ఇరాన్‌కు పారిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.

అయితే, హిబ్ జొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్‌ అక్టోబర్‌ 5వ తేదీనే బీరుట్‌ను వీడిచి పెట్టినట్లు ఇరాన్‌ వర్గాలను ఊటంకిస్తూ యూఏఈకి చెందిన ఎరెమ్‌ న్యూస్‌ ఓ కథనం ప్రసారం చేసింది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఆయన బీరుట్ నుంచి ఇరాన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే ఛాన్స్ ఉండటంతో ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే నయీమ్‌ ఖాసిమ్ లెబనాన్‌ను వదిలేసినట్లు వెల్లడించింది.

ఇక, సెప్టెంబర్‌ 27న ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా చనిపోయారు. నస్రల్లా మృతి తర్వాత నయీమ్‌ ఖాసిమ్‌ మూడుసార్లు మాట్లాడారు. అందులో ఒకటి బీరుట్‌ నుంచి కాగా, మిగతా రెండు టెహ్రాన్‌ నుంచి.. నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయెల్‌ ముఖ్య టార్గెట్‌గా నయీమ్‌ ఉన్నాడు. దీంతో ఆయన ప్రాణ భయంతో లెబనాన్‌ నుంచి ఇరాన్ పారిపోయినట్లు సమాచారం. మిలిటెంట్‌ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నయీమ్‌ ఖాసిమ్‌ ఒకరుగా ఉన్నారు. ఇజ్రాయెల్‌ టార్గెట్ చేసిందనే సమాచారంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తర్వాత సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసిమ్ పాల్గొన్నారు. హసన్ నస్రల్లా మరణించిన తర్వాత హెజ్‌బొల్లా చీఫ్‌ బాధ్యతలు ఖాసిమ్ కు అప్పగించినట్లు తెలుస్తుంది.