Leading News Portal in Telugu

30,000 Hindus Rally In Bangladesh Demanding Protection From Attacks


  • బంగ్లాదేశ్ లో హిందూ సంఘాల ఆందోళన..

  • తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువుల నిరసన..

  • ఛాటోగ్రామ్ లోని రోడ్డుపై 30 వేల మంది హిందువుల భారీ ర్యాలీ..
Bangladesh: బంగ్లాదేశ్లో రోడ్డెక్కిన 30 వేల మంది హిందువులు..

Bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా హింస చెలరేగుతుంది. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆ దేశ హిందువులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమపై దాడులను అరికట్టాలంటూ ఛాటోగ్రామ్ నగరంలోని హిందువులు రోడ్డు మీదకు వచ్చారు. ఏకంగా 30 వేల మంది భారీ ర్యాలీ తీశారు. తమకు రక్షణ కల్పించాలని మధ్యంతర సర్కార్ కి విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ర్యాలీ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు, సైనికులు ఛాటోగ్రామ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అయితే, ప్రజల్లో వ్యతిరేకత, విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయింది. ఆ తర్వాత తాత్కాలికంగా ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక సర్కార్ ఏర్పడింది. దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొని, ఎన్నికలు జరిగాక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు యూనస్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా కొనసాగుతారని అక్కడి సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు ఆగిపోయాయి. అయితే, దేశంలోని మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపై దాడులు క్రమంగా పెరిగిపోయాయి. గత ఆగస్టు నుంచి వేలాది మంది హిందువులపై దాడులు, దోపిడీ ఇతరత్రా అకృత్యాలు కొనసాగుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల హిందువులు ర్యాలీలు, నిరసనలకు దిగుతున్నారు.