Leading News Portal in Telugu

Shooting in Pakistan’s Karachi injures two Chinese nationals


  • పాకిస్తాన్‌లో మరోసారి చైనీయులపై దాడి..

  • ఇద్దరు చైనా జాతీయులపై కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం..

  • చైనా ఆందోళన నేపథ్యంలో ఘటన..
Pakistan: చైనీయులే టార్గెట్‌గా కరాచీలో కాల్పులు..

Pakistan: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా చైనీయులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ పౌరులకు భద్రత కల్పించాలని చైనా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

ఇద్దరు చైనా జాతీయులపై కాల్పులు జరిగాయని సీనియర్ పోలీస్ అధికారి ఫైజల్ అలీ చెప్పారు. అయితే, తదుపరి సమాచారం ఇవ్వలేదు. ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి వెనక ఎవరున్నారు అనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు. అక్టోబర్ నెలలో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు. దీనికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) బాధ్యత ప్రకటించింది. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం ఈ గ్రూప్ పోరాడుతోంది. ఈ ప్రావిన్స్ గుండా వెళ్తున్న సీపెక్(చైనా పాక్ ఎకనామిక్ కారిడార్)‌లో పనిచేస్తున్న చైనీయులను టార్గెట్ చేస్తోంది.