- ట్రంప్ విజయంపై పాకిస్తాన్ మౌనం!
-
మొదటి టర్మ్ నుంచి పాక్ పట్ల ట్రంప్ వ్యతిరేక వైఖరి -
ఆ కారణంతోనే ట్రంప్ విజయంపై నోరుమెదపని పాకిస్తాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విక్టరీపై ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు స్వర్ణయుగం తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాధినేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. నాటో దేశాధినేతలతో సహా పలు దేశాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ట్రంప్ గెలుపుపై మౌనం వహించింది. పాకిస్తాన్ ప్రభుత్వాధినేతల నుంచి స్పందన కరవైంది. అమెరికా ఎన్నికల గురించి ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భారత ప్రధాని మోడీ మాత్రం.. ట్రంప్‌కు శుభకాంక్షలు తెలిపారు. మిత్రుడుకు హృదయపూర్వక అభినందనలు అంటూ మోడీ పేర్కొన్నారు.
ట్రంప్ గెలుపుపై పాకిస్తాన్ మౌనానికి కారణమిదే!
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న (2016-20) సమయంలో పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించారు. సైనిక సహాయాన్ని నిలిపివేశారు. అంతేకాకుండా ఇస్లామాబాద్ గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఒత్తిడి చేశారు.
2018లో పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని తగ్గించినట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పనిచేస్తున్న సమూహాలకు ఆశ్రయం ఇచ్చిందని ట్రంప్ ధ్వజమెత్తారు.
“అమెరికా గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు మూర్ఖంగా 33 బిలియన్ డాలర్ల సహాయం చేసింది. వారు మాకు అబద్ధాలు, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదు. మన నాయకులను వారు మూర్ఖులుగా భావిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మేము వేటాడే ఉగ్రవాదులకు వారు సురక్షితమైన స్వర్గధామం ఇస్తారు. సహాయం ఇక లేదు!’’ అంటూ 2019లో ఎక్స్ పోస్ట్‌లో ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ మొదటి టర్మ్‌లో పాకిస్తాన్‌తో దెబ్బతిన్న సంబంధాలు మెరుగుపడకపోవచ్చని డాన్ కథనం పేర్కొంది. భారత్‌తో అమెరికాకు ఉన్న సంబంధాలు కారణంగా పాకిస్తాన్‌ను ట్రంప్ పక్కన పెట్టే అవకాశం ఉందని కథనంలో వెల్లడించింది. పాకిస్తాన్.. మొదటి నుంచి చైనాతో సంబంధాలు కలిగి ఉంది. ఇక అమెరికాకు చైనా ఏ మాత్రం పడదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను ట్రంప్ పక్కనపెట్టొచ్చనే వార్తలు వినిపిస్తు్న్నాయి. గతంలో ట్రంప్ వ్యవహరించిన తీరుతోనే అమెరికా ఫలితాలపై పాకిస్తాన్ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వెళ్లొచ్చని డాన్ కథనం తెలిపింది.
The United States has foolishly given Pakistan more than 33 billion dollars in aid over the last 15 years, and they have given us nothing but lies & deceit, thinking of our leaders as fools. They give safe haven to the terrorists we hunt in Afghanistan, with little help. No more!
— Donald J. Trump (@realDonaldTrump) January 1, 2018