- 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉంచేలా ఆస్ట్రేలియా ప్లాన్..
-
తమ సైట్లను 16 ఏళ్లలోపు పిల్లలు యాక్సెస్ చేయకుండా సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలి.. -
రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉండేలా ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంది. ఆన్లైన్ నుంచి పిల్లలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఈ ఏడాది చివరిలో ప్రవేశ పెట్టనున్న ఈ కొత్త చట్టం పిల్లలు, టీనేజర్లకు సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ చేస్తున్న నష్టానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా తాము భావిస్తున్నామని తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు తమ సైట్లను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి సోషల్మీడియా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల అంగీకారం ఉన్నా.. పిల్లలకు ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పేర్కొన్నారు.
కాగా, యాక్సెస్ను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఉందని ప్రధాని అల్బనీస్ తెలిపారు. పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని నిర్ధరించడానికి టెక్కంపెనీలను జవాబుదారీగా ఉండాలన్నారు. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఆమోదం పొందిన 12 నెలల తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తుందన్నారు. అయితే, ఈ చట్టం అమల్లోకి వచ్చే సమయానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పిల్లలపై ఎలాంటి నిషేధం ఉండదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడించారు.
ఇక, ఈ చట్టం అమలును ఆస్ట్రేలియాకు చెందిన ఈ-సేఫ్టీ కమిషనర్ పర్యవేక్షిస్తారని ప్రధాని అల్బనీస్ చెప్పుకొచ్చారు. యువ యూజర్లకు ఎలాంటి జరిమానాలు ఉండవు.. సోషల్మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం నిబంధనలు పాటించకపోతే.. తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడకంపై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు గతంలో చేసిన ప్రయత్నాలు చేశాయి. కానీ, చాలా మంది పిల్లలు వయస్సు- ధృవీకరణను తప్పుగా నమోదు చేసి సోషల్ మీడియా యాప్స్ను వాడుతున్నారని నిపుణలు చెప్పుకొచ్చారు.