- ‘బ్లూ వాల్’ను డొనాల్డ్ ట్రంప్ బద్దలు కొడతాడా.?
- రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు.
- ‘బ్లూ వాల్’ అంటే?

America Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా రకాలుగా విభిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రక్రియ వేరుగా ఉంటుంది. కానీ, అమెరికా ఎన్నికల్లో ఎక్కువగా చర్చిస్తున్న అంశం ‘బ్లూ వాల్’. మంగళవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇకపోతే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడయ్యేందుకు సర్వశక్తులు ప్రయత్నం చేసారు. అయితే, అమెరికా రాజకీయ విశ్లేషకులు అతను అధ్యక్షుడవ్వాలనుకుంటే, అతను “బ్లూ వాల్” ను ఛేదించవలసి ఉంటుందని అంటున్నారు.
సాంప్రదాయకంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలను “బ్లూ వాల్” రాష్ట్రాలు అంటారు. ఇందులో 18 రాష్ట్రాలు ఉంటాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, మిచిగాన్, న్యూజెర్సీ, వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్, మిన్నెసోటా, విస్కాన్సిన్, ఒరెగాన్, కనెక్టికట్, హవాయి, మైనే, రోడ్ ఐలాండ్, డెలావేర్, వెర్మోంట్ లను ‘బ్లూ వాల్’ రాష్ట్రాలు అంటారు. ఇందులో 238 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే, 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. కాబట్టి కమలా హారిస్ ఈ బ్లూ వాల్ స్టేట్‌లలో విజయం సాధిస్తే, అధ్యక్షుడిగా మారడం సులభం అవుతుంది. ట్రంప్ గెలవాలంటే, అతను కనీసం ఆ 18 రాష్ట్రాల్లో కొన్నింటి లోనైనా విజయం సాధించాలి.
ఇకపోతే, 1992 నుండి 2012 వరకు ఈ బ్లూ వాల్ రాష్ట్రాలలో ఏకపక్షంగా డెమోక్రటిక్ పార్టీ వైపు నిలిచాయి. అయితే, 2016 ఎన్నికల్లో మాత్రం పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో అనూహ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారు. ఆ మూడు రాష్ట్రాలలో మొత్తంగా 44 ఎలక్టోరలు ఉన్నాయి. ఆ సమయంలో ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఈ ఓట్లు ఎంతగానో ఆయనకు ఉపయోగపడ్డాయి.