- కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే వారికి షాక్..
-
ఎస్‌డీఎస్ వీసా నిలిపేస్తున్నట్లు ప్రకటన.. -
భారత్‌తో సహా 14 దేశాల విద్యార్థులపై ప్రభావం..
Canada Student Visa: కెనడా వెళ్లి చదువుకోవాలనుకోవడం భారతీయ విద్యార్థుల్లో చాలా మందికి ఉంటుంది. ఇన్నాళ్లు ఆ దేశ ప్రభుత్వం కూడా భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే విద్యార్థులను ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు షాక్ ఇచ్చింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీమ్‌ని నిలిపేసింది. కెనడా ప్రస్తుతం హౌసింగ్ సంక్షోభంతో పాటు వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇబ్బడిముబ్బడిగా ఆ దేశంలోకి వలసలు పెరిగిపోతున్నాయని అక్కడి కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టూడెంట్ వీసా ప్రోగ్రామ్‌ని నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఉద్దేశించబడిన ‘‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(SDS) వీసా’’ కార్యక్రమాన్ని శుక్రవారం నిలిపివేసింది. బ్రెజిల్, చైనా, కొలంబియా, కోస్టారికా, ఇండియా, మొరాకో, పాకిస్థాన్, పెరూ, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాంతో సహా 14 దేశాల నుండి స్టూడెంట్స్ కోసం స్టడీ పర్మిట్ అప్లికేషన్లను వేగవంత చేయడానికి ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ మరియు సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) 2018లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది. ‘‘ ఈ ప్రోగ్రామ్ సమగ్రతను బలోపేతం చేయడానికి, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ సమానమైన, న్యాయపరమైన యాక్సెస్ అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని కెనడా ప్రభుత్వం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ స్కీమ్ ద్వారా నవంబర్ 8న మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తుల్ని మాత్రమే ప్రాసెస్ చేస్తామని చెప్పింది. దీని తర్వాత వచ్చే అన్ని దరఖాస్తులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ స్ట్రీమ్ కింద ప్రాసెస్ చేయబడతాయి. . ఈ కార్యక్రమం నిలిపివేయడంతో, భారతదేశం మరియు 13 ఇతర దేశాల విద్యార్థులు మరింత సుదీర్ఘమైన వీసా ప్రక్రియలకు లోనవుతారు. కెనడా మొదటిసారిగా దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని భావిస్తోంది.