Leading News Portal in Telugu

S Jaishankar, Chinese Foreign Minister Wang Yi meet for first time since border deal


  • బ్రెజిల్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ..
  • ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు వెల్లడి..
S Jaishankar: చైనా విదేశాంగ మంత్రితో ఎస్. జైశంకర్ భేటీ..

S Jaishankar: బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో కొనసాగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌- చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉప సంహరణ విషయంలో ఇరు దేశాలు కొంత పురోగతి సాధించాయని చెప్పుకొచ్చారు. ఇది స్వాగతించదగ్గ విషయం అని పేర్కొన్నారు. ఇది ఇతర అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పుకొచ్చారు. అలాగే, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరు దేశాల ప్రాముఖ్యతను ఈ భేటీలో తమకు గుర్తు చేసిందని వెల్లడించారు.

ఇక, 2020 జూన్‌ 15వ తేదీన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా సైనికులు కూడా భారీగా చనిపోయారు. కానీ ఆ సంఖ్యను తెలపలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. వాటిని నివారించేందుకు భారత్‌- చైనా మధ్య అనేక దఫాల చర్యలు జరిగాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాజాగా ముగింపు పలుకుతూ ఇటీవల ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం చేసుకున్నాయి.