Leading News Portal in Telugu

Russia President Putin Eased Moscow Rules For Nuclear Strikes


  • రష్యా పైకి యూఎస్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్‌..
    అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే ఫైల్పై వ్లాదిమిర్ పుతిన్‌ సంతకం..
    రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దు: ఐరాస
Nuclear War: అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే ఫైల్పై పుతిన్‌ సంతకం..

Nuclear War: ప్రపంచం ముందు మరో అణు యుద్ధం ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరిగిపోతుంది. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అమెరికా పర్మిషన్ ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టినట్లు సమాచారం. ఒకవేళ పశ్చిమ దేశాలు నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలను ఉపయోగించేలా అణు ముసాయిదాను సవరించారు. ఇక, అణ్వాయుధాలు ఉన్న దేశం సహాయంతో తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పుతిన్ స్పష్టంగా పేర్కొన్నారు.

కూటమిగా ఎవరు దాడి చేసినా.. ఆయా దేశాలపై రష్యా అణు దాడి చేసేలా నిబంధనను రష్యా రూపొందించింది. మరోవైపు అమెరికా అనుమతితో ఉక్రెయిన్‌ ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాపై దాడి చేసింది. ఇందులో ఐదింటిని కూల్చేశాం.. మరోదాన్ని ధ్వంసం చేశామని రష్యా సైన్యం పేర్కొనింది. రెండు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఐరోపా దేశాలు అలర్ట్ అయ్యాయి. చిన్న పిల్లల ఆహార పదార్థాలు, ఔషధాలు, తాగు నీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు ఇప్పటికే సూచనలు జారీ చేశాయి. అయితే, లిథువేనియా-స్వీడన్‌; ఫిన్లాండ్‌-జర్మనీల మధ్య ఇంటర్నెట్‌ను అందించే సముద్ర గర్భ కేబుళ్లు తెగిపోవడం వెనక మాస్కో హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని ఐక్యరాజ్య సమితి రాజకీయ వ్యవహారాల అండర్‌ సెక్రటరీ-జనరల్‌ రోజ్మేరీ డికార్లో తెలిపారు.