Leading News Portal in Telugu

Russia has launched a non nuclear Intercontinental Ballistic Missile against Ukraine for the first time in this war


  • ఉక్రెయిన్-రష్యా మధ్య రాజుకున్న యుద్ధం
  • ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం
  • దెబ్బతిన్న డ్నిప్రో నగరం
Russia-Ukraine War: రాజుకున్న యుద్ధం.. ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం

ఉక్రెయిన్-రష్యా మధ్య మరోసారి భీకరమైన యుద్ధం మొదలైంది. రెండేళ్ల నుంచి యుద్ధం నడుస్తుండగా.. ఈ మధ్య కొద్దిగా నెమ్మదించింది. అయితే తాజాగా మరోసారి రెండు దేశాలు కాలుదువ్వుకుంటున్నాయి. ఇటీవల రష్యాపై అమెరికా రహిత క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో యుద్ధం చల్లబడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్.. అణు దస్త్రంపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని ప్రయోగించింది. రెండేళ్లలో ఉక్రెయిన్‌పై ఈ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి. రాత్రిపూట ఈ క్షిపణిని ప్రయోగించింది. డ్నిప్రో నగరాన్ని తాకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఏ రకమైన క్షిపణి ప్రయోగించారో ఇప్పటి వరకు రష్యా స్పష్టంగా ప్రకటన చేయలేదు. కానీ ఉక్రెయిన్ వైమానిక దళం మాత్రం గురువారం టెలిగ్రామ్‌లో రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇలాంటి క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇప్పటికే రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు రంగంలోకి దిగాయి. తాజా యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా దాడులతో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేసినట్లుగా తెలుస్తోంది. డ్నిప్రో నగరానికి భారీ నష్టం జరిగినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే రష్యా దాడులను అమెరికా ముందుగానే పసిగట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని మూసివేశారు. అమెరికాతో పాటు ఇటలీ, స్పెయిన్‌ సహా పలు దేశాలు ఎంబసీ కార్యాలయాలను మూసివేశారు. రష్యా దాడులకు ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. భారీ ఆయుధాలను సరఫరా చేస్తోంది. తాజా యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి.