- జపాన్ లో విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం
- పూర్తి వివరాలు ఇలా..
Divorce Temple: ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక కథ, ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కొన్ని దేవాలయాలు వాటి గొప్ప వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందగా, కొన్ని వాటి మత విశ్వాసాలకు ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలో దేవతలకు, దేవుడులకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలోని ప్రత్యేకమైన సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం ఉంది.
సాధారణంగా, ప్రజలు తమ కోరికలను నెరవేర్చడానికి, దేవుడి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు వెళతారు. కానీ, జపాన్‌లో ఒక ఆలయం ‘ విడాకుల ఆలయం’ అని పిలుస్తారు. గృహ హింస లేదా అఘాయిత్యాలకు గురైన మహిళలకు ఈ ఆలయం స్వర్గధామం. శతాబ్దాల క్రితం జపాన్‌లో మహిళల హక్కులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించారని సమాచారం. మహిళలు ఇక్కడికి రావడంతో శారీరకంగా, మానసికంగా కోలుకోవడమే కాకుండా సామాజిక మద్దతు కూడా పొందారు. నేటికీ ఈ ఆలయం మహిళా సాధికారతకు ప్రతీక.
జపాన్ లో మహిళలు ఎటువంటి హక్కులు లేని సమయంలో పురుషులు తమ భార్యలకు సులభంగా విడాకులు ఇచ్చే సమయంలో, ఈ ఆలయం గృహహింసతో బాధపడుతున్న మహిళలకు ఆశ్రయం కల్పించింది. భర్త క్రూరత్వానికి గురై పారిపోతున్న ప్రతి స్త్రీకి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. ఇక్కడికి రావడం వల్ల వారికి శారీరక భద్రత మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక శాంతి, సాంత్వన లభించే వాతావరణం కూడా లభించింది. ఈ ఆలయం ఇప్పటికీ అలాంటి అణచివేతలను ఎదుర్కొంటున్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది జపాన్ లోని కమకురా నగరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం. దీని చరిత్ర సుమారు 700 ఏళ్ల నాటిది. ఈ ఆలయాన్ని ‘విడాకుల దేవాలయం’ అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని బౌద్ధ సన్యాసిని కకుసన్ తన భర్త హోజో టోకిమున్‌తో కలిసి నిర్మించారు. ఆ తర్వాత కకుసన్ స్వయంగా విడాకుల విషయంలో చిక్కుకుంది. అందుకే, భర్త నుంచి విడిపోయి మహిళలు శాంతియుతంగా జీవించే చోటు కల్పించాలని నిర్ణయించుకుంది.
స్త్రీలు తమ భర్తలను విడిచిపెట్టే ముందు మూడు సంవత్సరాల పాటు ఈ ఆలయంలో ఉండవచ్చు. కాలక్రమేనా తర్వాత ఈ వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు. ఇక్కడ ఉండడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా స్వావలంబన పొందే అవకాశం కూడా లభించింది. చాలా ఏళ్లుగా ఈ ఆలయంలోకి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ, 1902లో ఎంగాకు-జీ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, మగ మఠాధిపతిని నియమించారు. దాంతో పురుషులు కూడా ప్రవేశించడం ప్రారంభించారు.